శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండళికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64 జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు పెళ్లిచూపులు, శతమానంభవతి అవార్డుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ శతమానంభవతి చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు సతీష్‌వేగేశ్నతో పాటు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాత రాజ్‌కందుకూరి, ైస్టెలిష్ట్ లతానాయుడు, హీరో విజయ్ దేవరకొండ,   2012,2013 నంది అవార్డుల విజేతలైన   మామిడి హరికృష్ణ, నందగోపాల్, రవిచంద్రలను మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగువారందరికి ఆనందదాయకంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన దర్శకనిర్మాతల్ని ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవించడం అభినందనీయం. సీతాకొకచిలుక కావడానికి గొంగళిపురుగు దశను దాటాలి. అలాగే యువతరంలో దాగివున్న ప్రతిభ వెలుగులోకి రావడానికి వారికి చేయూత అవసరం. నిర్మాతగా తెరవెనుక నుండి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ హీరోలను ముందుకు నడిపిస్తున్నారు దిల్‌రాజు. శతమానంభవతిలో  ప్రకాష్‌రాజ్, జయసుధ అద్వితీయమైన అభినయాన్ని కనబరిచారు. తక్కువ సంభాషణలు, చక్కటి హావభావాలతో అర్థవంతంగా వారి నటన సాగింది. దర్శకుడు తాను తెరపై చూపించదలుచుకున్న మంచి అంశానికి అవసరమైన స్వేచ్ఛ, వనరులతో పాటు అభిరుచికలిగిన నిర్మాత దొరికితే శతమానంభవతి లాంటి చిత్రాలు రూపొందుతాయి. సిరివెన్నెల, సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, శంకరాభరణం వంటి ఆహ్లాదకరమైన టైటిల్స్‌తో ఒకప్పుడు సినిమాలు రూపొందేవి. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగుదనంతో కూడిన మంచి టైటిల్‌తో శతమానంభవతి తెరకెక్కింది. పెళ్లిచూపులులో  నిత్యజీవితంలో ఉపయోగించే యాస, భాషను సహజంగా చూపించారు దర్శకుడు తరుణ్‌భాస్కర్.  సినిమాల కోసం ప్రత్యేకంగా సంభాషణలను సృష్టించాల్సిన అసవరం లేదని, నిత్యం ఉపయోగించే  భాష సరిపోతుందనే తరుణ్‌భాస్కర్ చొరవను ప్రోత్సహించిన  రాజ్‌కందుకూరి, సురేష్‌బాబు అభినందనీయులు అని తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం  నారాయణ మాట్లాడుతూ మూసధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో కథాబలమున్న చిన్న సినిమా పెళ్లిచూపులు జాతీయ స్థాయిలో అవార్డునుఅందుకోవడం గర్వకారణంగా చెప్పవచ్చు. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మక కథాంశాలు, నూతన ఒరవడితో కూడిన మంచి సినిమాలు అనేకం రూపొందుతున్నాయి. కానీ తెలుగు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. విలువలతో కూడిన మంచి సినిమాలు రావడంలేదు.  కొత్త సినిమాల్లో సంగీతం, సాహిత్యం  పతనమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో శతమానంభవతిలో పల్లెటూరి వాతావరణాన్ని, పెద్దలకు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు. పెళ్లిచూపులు సినిమాకుగాను మాటల రచయితగా తరుణ్‌భాస్కర్‌కు అవార్డు రావడం గర్వకారణంగా చెప్పవచ్చు. హైదరాబాద్ యాస, భాషలోని రమ్యతను సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిన్న సినిమాలకు అవార్డులు రావడం పట్ల  తెలుగు చిత్రపరిశ్రమలోని పెద్ద నిర్మాతలు, సంస్థలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ పట్ల సినీ పరిశ్రమ ఆలోచన ధోరణినిని సవరించుకోవాల్సిన అవసరముంది. ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమని గుర్తించాలి.  సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎక్కడికి తరలిపోదు. ఇక్కడే మనగడ సాగిస్తుంది అని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, 2012 ఏడాదికిగాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్న మామిడి హరికృష్ణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలకు చేకూర్చేలా సీఏం కేసీఆర్ అనేక ప్రణాళికలు, పథకాల్ని అమలు చేస్తున్నారు. తరుణ్‌భాస్కర్ రూపొందించిన సైన్మా లఘు చిత్రం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక వారోత్సవాల్లో తొలుత ప్రదర్శితమైంది. కొత్త తరహా, రేపటి తెలంగాణ సినిమాకు పెళ్లిచూపులు చిత్రం చక్కటి నాందిగా నిలిచింది. నైజాం కాలం నుంచి తెలంగాణ సినిమా ప్రగతిశీల భావాలతో ముందుకు సాగుతుంది. ఓ ప్రయోజనాత్మక, అర్థవంతమైన సినిమాలకు తెలంగాణ చిత్రాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ సినిమా తనదైన ముద్రతో ఎదుగుతుందనడానికి  పెళ్లిచూపులు, అప్పట్లో ఒకడుండేవాడు, ఘాజీ సినిమాల్ని నిదర్శనంగా చెప్పవచ్చు అని పేర్కొన్నారు.   శతమానంభవతి లాంటి మంచి సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకుపోవడానికి, అవార్డులు తెచ్చిపెట్టడానికి కారణమైన ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి సన్మానాన్ని పొందడం  ఆనందంగా ఉందని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్‌భాస్కర్, విజయ్‌దేవరకొండ, సతీష్‌వేగేశ్న, రాజ్‌కందుకూరి, సమాచార హక్కు కమీషనర్ విజయ్‌బాబు, ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సెక్రటరీ మడూరి మధు, సీనియర్ సినీ జర్నలిస్ట్ గుడుపూడి శ్రీహరి, గీతాభాస్కర్, లతానాయుడు, పత్యాగాత్మ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. 

About CineChitram

Check Also

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకి అల్లు రామ‌లింగ‌య్య అవార్డు ప్ర‌దానోత్స‌వం!!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading