ఎమ్మెస్ రాజు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో నిర్మాతగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆయన అభిరుచి గల దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. . ఎలాంటి సన్నివేశాన్ని తెరకెక్కించినా కళ్లకు అందంగా ఉండటంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి, ఆలోచింపజేయడం ఎమ్మెస్ రాజు ప్రత్యేకత. అలాంటి ఆయన తాజాగా మరో వినూత్నమైన శృంగారభరితమైన చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రానికి `రతి` అనే పేరు పెట్టారు. ఆరు భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీలోనూ ఆ చిత్రాన్ని తెరకెక్కించడానికి సర్వసన్నాహాలు చేసుకున్నారు ఎమ్మెస్ రాజు. ఇప్పటి వరకు అతి కొద్ది మంది దర్శకులు, అందులోనూ అగ్ర దర్శకులు మాత్రమే స్పృశించిన వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ఆయన సిద్ధమయ్యారు. తమిళంలో బాలచందర్, శ్రీధర్, మలయాళంలో భరతన్, కన్నడలో పుట్టణ్ణ కణగళ్ వంటి గొప్ప దర్శకులు ఈ జోనర్‌లో చిత్రాలను తెరకెక్కించారు. అలాంటి పటిష్టమైన, సౌందర్యాత్మకమైన, కళ్లకు కట్టినట్టుండే కావ్యాత్మకమైన కథతో ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎమ్మెస్ రాజు సంసిద్ధులయ్యారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది.
ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ “శృంగారభరితంగా సాగే వినూత్నమైన చిత్రమిది. `రతి` అనే టైటిల్, ఈ నేపథ్యం విన్న వారందరికీ కొత్తగా అనిపిస్తుంది.ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీలోనూ సినిమాను రూపొందిస్తాం. సౌందర్యాత్మకంగా కనిపిస్తూ, పొయిటిగ్గా సాగే చిత్రమిది. నేను ఇప్పటిదాకా ఇలాంటి నేపథ్యం ఉన్న కథతో సినిమా చేయలేదు. కానీ అతి తక్కువ మంది, అందులోనూ హేమాహేమీ దర్శకులు మాత్రం ఈ జోనర్‌లో చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు తొలిసారి నేను చేస్తున్నాను. మా కథ సిద్ధం కాగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అన్ని క్రాఫ్ట్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది“ అని అన్నారు.