సిక్స్‌ఫ్రెండ్స్ క్రియేషన్స్ బ్యానర్‌లో మాస్టర్ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, పి.సి. రెడ్డిల శిష్యుడు డా|| క్రిష్ణమోహన్ గొర్రెపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ..తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుర్రతుఫాన్’. ఈ చిత్రం చివరి షెడ్యూల్ మార్చి 3వ తేదీ నుండి మొదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు డా|| క్రిష్ణమోహన్ గొర్రెపాటి మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాళ్ళకు అండగా ఉండే పాత్రలో విద్యాశాఖ మంత్రిగా..షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఒక సీనియర్ నటుడ్ని ఈ పాత్రకు ముందు అనుకున్నాం. కానీ ఆ నటుని డేట్స్ లేకపోవడంతో..ప్రతాప్‌రెడ్డిగార్ని ఈ పాత్రకు తీసుకోవడం జరిగింది. ఆయన్ని ఈ విషయమై అడుగగా వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. అలాగే ఆయనకు సినిమా రంగం కొత్త అయిన కూడా..షాట్స్ తీసేటప్పుడు అడిగి తెలుసుకుని మరీ నటిస్తున్నారు. ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రస్తుత షూటింగ్ లొకేషన్‌లో కమెడియన్ ఆర్.ఎస్. నంద చేసే కామెడీకి యూనిట్ అంతా పొట్టచక్కలయ్యేలా నవ్వుతుంది. ఇలాంటి నవ్వులతో రేపు థియేటర్‌లోని ప్రేక్షకులను కూడా నంద అలరించనున్నాడు. ఆయన కామెడీ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. సైంటిఫిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో పూర్తి చేసి వెంటనే ఓ ప్రముఖ స్టార్ హీరో చేతుల మీదుగా ఆడియోని రిలీజ్ చేసి, ఈ సమ్మర్‌కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము…అని తెలిపారు.
విద్యాశాఖ మంత్రిగా నటిస్తున్న ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ చిత్రానికి పనిచేస్తున్న కొంతమంది కుర్రాళ్ళు నాకు పరిచయం ఉండటం, వాళ్లకి కావాల్సిన ఓ నటుడి డేట్స్ వాళ్ళకి దొరకక పోవడం వల్ల దర్శకుడు, అతని స్నేహితులు వచ్చి నన్ను అడగడం జరిగింది. వాళ్లు ఈ సినిమాకి ఎంతో కష్టపడటం చూసి..వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో కాదనలేక నటించడానికి ఒప్పుకున్నాను. దర్శకుడికి ఓపిక చాలా ఎక్కువ. భవిష్యత్‌లో తన గురువు యస్వీ కృష్ణారెడ్డి అంతటివాడు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు..నేను నా నియోజక వర్గ ప్రజలకు అండగా ఉన్నట్లే..ఈ సినిమా విషయంలో అండగా ఉంటాను..అని అన్నారు.
కమెడియన్ ఆర్.ఎస్. నంద మాట్లాడుతూ..ఈ అవకావం ఇచ్చిన దర్శకునికి కృతజ్ఞతలు. ఆయన కృష్ణారెడ్డిగారి శిష్యుడు కావడం వల్ల..ఈ సినిమాలో కామెడీకి పెద్ద పీట వేశారు. ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు చాలా మంచి బ్రేక్, అలాగే మంచి నేమ్ వస్తుందని ఆశిస్తున్నాను..అన్నారు.
కావ్య, వీరేందర్, హరి, ఆర్.ఎస్.నంద, బ్రహ్మానందం, ఆలీ, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ మరియు నూతన నటీనటులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపాల్ సామ్రాజ్, సంగీతం: టి.పి. భరద్వాజ్, పాటలు: చంద్రబోస్, నిర్మాణం: సిక్స్‌ఫ్రెండ్స్ యూనిట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: డా|| క్రిష్ణమోహన్ గొర్రెపాటి.