ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం ‘లేడీస్ టైలర్’ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది.
రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం ‘లేడీస్ టైలర్’ సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు అభిరుచిగల నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.
‘లేడీస్ టైలర్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
”నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, ఆనాటి మేటి చిత్రం ‘లేడీస్ టైలర్’ స్థాయి ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ప్రేక్షకుల్ని అలరించే కథ, కథనాలను రంగరించి, ‘ఫ్యాషన్ డిజైనర్ – సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందుతోంది. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం పాపికొండలు, రాజోలు పరిసరప్రాంతాల్లో నిర్విరామంగా 62 రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ వేసవికి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నవ్వుల వర్షంలో ప్రేక్షులు తడిసి ముద్దయ్యేలా చేయనుంది ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ చిత్రం. ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మే నెల 3 వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అలాగే మే నెల మొదటి వారంలో సినిమా మ్యూజిక్ లాంఛ్ చేయనున్నాం” అని మధుర శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం: మణి శర్మ, సినిమాటొగ్రఫి: నగేష్ బన్నెల్ , ఎడిటర్: భస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి వై సత్యనారాయణ, మాటలు: కల్యాణ్ రాఘవ్, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీమణి, శ్రీవల్లి.
You must be logged in to post a comment.