‘‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ సినిమా బాగుందని తెలిసి, ఇటీవల ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. చాలా ట్రెండీగా, అదే టైమ్‌లో ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు సినిమాను బాగా తీశారు. డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా రావు రమేశ్ బాగా నటించాడు. క్లైమాక్స్‌లో అతని నటన చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి’’ అని దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అన్నారు. హెబ్బా పటేల్, రావు రమేశ్, తేజస్వి, అశ్విన్ బాబు, నోయెల్, పార్వతీశం ముఖ్య తారలుగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ (గోపీ) నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ఈ నెల 16న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన దాసరి నారాయణరావు శుక్రవారం చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఇంకా దాసరి మాట్లాడుతూ – ‘‘నిర్మాత గోపీ గత సినిమా ‘సినిమా చూపిస్త మావ’ను కూడా బాగా తీశాడు. ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ చిత్రాన్ని 40 రోజుల్లో కంఫర్టబుల్ బడ్జెట్‌లో చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. ఈ మధ్య కాలంలో షెడ్యూల్ ప్రకారం అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడం అరుదుగా జరుగుతుంది. అతను ఇలాగే మంచి సినిమాలను తీస్తూ వెళ్లాలి. ప్రస్తుతం ఎలాంటి ప్రణాళిక లేకుండా వారానికి ఐదారు సినిమాలు విడుదల చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. నోట్ల రద్దు, అవీ లేకుండా ఉంటే ఈ సినిమా ఇంకా బాగా కలెక్ట్ చేసేది. ఇప్పుడు వసూలు చేసిన దానికంటే రెట్టింపు వసూళ్ళు వచ్చేవి’’ అన్నారు.
దర్శకుడు బండి భాస్కర్ మాట్లాడుతూ – ‘‘150కు పైగా చిత్రాలు తీసిన దర్శకుడు దాసరిగారు నా తొలి చిత్రం చూసి మెచ్చుకోవడం అంటే అంతకు మించిన ప్రశంస లేదు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు.
‘‘దాసరిగారి ఆశీస్సులతో ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు నిర్మిస్తా’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్.
ఈ కార్యక్రమంలో కథారచయిత సాయికృష్ణ, రచయిత ప్రసన్న, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, సీనియర్ దర్శకులు ‘దవళ’ సత్యం తదితరులు పాల్గొన్నారు
Stills
You must be logged in to post a comment.