శ్రీవల్లీ గీతాలు విడుదల

 ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం, సునీత నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్ శ్రీలేఖ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి ప్రతిని సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి స్వీకరించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు కొరటాల శివ విడుదలచేశారు. ఈ  సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ నాన్నను చూసి గర్వపడిన క్షణాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. 1980లలో నాన్న, పెదనాన్న శివశక్తిదత్తా కలిసి ఘోస్ట్‌రైటర్స్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.  వారి  పేరును వెండితెరపై చూసుకోవాలని కుటుంబమంతా ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. 1988లో జానకి రాముడు సినిమాకు రచయితలుగా వారి పేరును తెరపై చూడగానే చాలా ఆనందం వేసింది.  ఆ క్షణంలో చాలా గర్వంగా అనిపించింది. నాన్నఎక్కువగా ఆంగ్ల సాహిత్యాన్ని  చదివేవారు. కానీ  ఆయన కథలు మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా ఉండేవి. మీరు హాలీవుడ్ తరహా కథలను ఎందుకురాయరు ఆయనతో పనిచేస్తున్నప్పుడు అడిగాను. ఆ సందర్భంలో 25 ఏళ్ల క్రితమే సునామి నేపథ్యంలో నాకు ఓ కథ వినిపించారు. అప్పటికీ సునామి అంటే నాకు తెలియదు. ఆ తర్వాత సునామి వచ్చినపుడు దాని శక్తి ఏమిటో తెలిసింది. 25 ఏళ్ల క్రితమే దానిప్రభావాన్ని ఊహించి నాన్న కథను చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలో బాహుబలి, బజరంగీ భాయిజాన్ సినిమాలు విడుదలై పెద్ద విజయాల్ని సాధించినపుడు చాలా గర్వపడ్డాను. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.  రచయితగా నాన్న మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ స్థాయిలోనే దర్శకుడిగా గొప్పగా సినిమా తీస్తే కొడుకుగా గర్వపడతాను.  దర్శకుడిగా నాన్నను నేను పోటీదారుగానే భావిస్తాను. నేను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఆయన తప్పులను వెతుకుతుంటారు. నాన్న దర్శకత్వం వహించిన సినిమాలో అలాంటి తప్పుల్ని నేను వెతుకుతాను.  కొడుకుగా గర్వపడే క్షణాల కోసం,  దర్శకుడిగా ఆయనతో దెబ్బలాడే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను.  నేను ఇప్పటి వరకూ శ్రీవల్లి సినిమా చూడలేదు. సినిమా విజయవంతమైతే ఇప్పటివరకూ నేను సంతోషపడిన అన్ని క్షణాల కంటే ఎక్కువ గర్వపడే సందర్భమిదే అవుతుంది అని తెలిపారు. కథ చెప్పడమంటే  నా దృష్టిలో అబద్ధాలు ఆడటమే. అందరికంటే నేనే ఎక్కువ అబద్ధాల కోరుననిపించుకోవాలని, తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాలని 20 ఏళ్లు పరుగులు పెడుతూనే ఉన్నాను.  కానీ సత్యానంద్, పరూచూరిబ్రదర్స్..ఇలా ఎప్పుడు ఎవరో ఒకరు నాకంటే ముందు  ఉండేవారు.  నేను కథలను అందించిన బజరంగీభాయిజాన్, బాహుబలి సినిమాలు రెండు వారాల వ్యవధిలో విడుదలవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధాల కోరుగా నాపై ముద్రపడింది. కీరవాణి, రాజమౌళిలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.  సహచరులతో  పోలిస్తే వీరి ఆస్తి తక్కువే అయినా  వారి కళ్లతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. ఓ తండ్రి తన కొడుక్కి ఆస్తి, అంతస్తులు ఏమీ  ఇవ్వకపోవచ్చు. కానీ తన ప్రవర్తన ద్వారా కొడుకుపై మచ్చ వేసే హక్కు మాత్రం తండ్రికి లేదు. నా బిడ్డ ఉన్న స్థాయికి వాడితో రెండు అబద్దాలు చెప్పించి సినిమాను అమ్ముకోవచ్చు. కానీ అలా చేయడం పాపం. డబ్బు గురించి ఆలోచించకుండా మంచి సినిమా చేయాలనే సంకల్పంతో నిర్మాతలు ముందుకొచ్చారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ రాని కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. మనసు లోతుల్లోకి చూడగలిగితే ఏం జరుగుతుందనే పాయింట్‌తో రూపొందింది. ఓ అమ్మాయి మనసుపై  శాస్త్రవేత్త చేసిన ప్రయోగం ఆమె జీవితాన్ని ఎలా  ఇబ్బందుల్లో పడేసింది.  ఈ ప్రయోగం కారణంగా అస్తవ్యస్తమైన తన జీవితాన్ని తిరిగి ఆమె ఎలా చక్కదిద్దుకున్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. విజయేంద్రప్రసాద్ నిరంతరం సినిమాల గురించే ఆలోచిస్తుంటారని, రాజమౌళిలా గొప్పగా సినిమాలు తీయాలని, విజయేంద్రప్రసాద్‌లా గొప్పగా కథలు రాయాలని ప్రతిసారి కోరుకుంటానని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. తొలి సినిమాతోనే విజయేంద్రప్రసాద్‌లాంటి గొప్ప రచయితతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి పాట ఆణిముత్యంలా ఉంటుంది. మహిళల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పే చిత్రమిది నిర్మాత సునీత తెలిపారు. నటులుగా, వ్యక్తిగతంగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకునే అవకాశం దొరికిందని,  కష్టపడి ఈ సినిమా చేశామని నాయకానాయికలు తెలిపారు ఎమ్.ఎమ్ శ్రీలేఖ మాట్లాడుతూ  నా ఆడియో వేడుకకు రాజమౌళి అన్నయ్య రావడం ఇదే తొలిసారి. మూసధోరణిలో వెళుతున్న నా ఆలోచన విధానాన్ని మార్చి నన్ను సరైన దారిలో నడిపించారు  అని చెప్పింది. ఈ కార్యక్రమంలో శివశక్తిదత్తా, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రాజ్‌కుమార్ బృందావనం, పరుచూరి గోపాలకృష్ణ, వక్కంతం వంశీ,  రాజగోపాల్, బి.వి.ఎస్ రవి, శ్రీవల్లీ, రమా రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

Stills

About CineChitram

Check Also

మంత్రి కేటీయార్ విడుదల చేసిన “శరణం గచ్చామి” ఆడియో !!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading