జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గీతాజంలి హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `మిక్చర్ పొట్లం`. సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటె వీరన్న చౌదరి,
లంకల పల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాదవపెద్ద సురేష్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్ జెఆర్.సీ సెంటర్లో ఘనంగా జరిగింది. వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంపీ మురళి మోహన్ బిగ్ సీడీని, సీడీలను ఆశిష్కరించారు. అనంతరం సీడీలను చిత్ర యూనిట్ కి అందజేశారు. థియేట్రికల్ ట్రైలర్స్ ను గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు.
అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ “ నేను రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ప్రాంతం నుంచి ముగ్గురు మంచి నిర్మాతలు సినిమా చేయడం ఆనందంగా ఉంది. మంచి కథ, కథనాలతో దర్శకుడు సతీష్ సినిమాను బాగా తీశారని ఆశిస్తున్నా. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. ఎస్. పి బాలసుబ్రమణ్యం గారు ఇందులో పాటలు పాడటం..మాదవ పెద్ది సురేష్ గారు సంగీతం అందించడం టీమ్ కు బాగా కలిసొస్తుంది. అలాగే ఈ సినిమాతో భానుచందర్ కుమారుడు జయంత్ హీరోగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలి. అలాగే రాష్ర్ట విభజన నేపథ్యంలో 2012 నుంచి నంది అవార్డులను అందిచలేకపోయాం. ఆ అవార్డులను త్వరలోనే అందిస్తాం. తెలంగాణ రాష్ర్టంలో కూడా నంది పేరు స్థానంలో వేరే పెరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులు ఇవ్వాలనుకుంటున్నారు. త్వరలోనే అది జరుగుతుంది` అని అన్నారు.
గాయకులు ఎస్. పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ “ భాను చందర్ చాలా సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలకు నేను పాటలు పాడాను. ఇప్పుడు వాళ్ల అబ్బాయి జయంత్ సినిమాకు పాటలను పాడే అవకాశం వచ్చింది. సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలు సినిమా బాగా చేశారనిపిస్తుంది. సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి యువతరానికి తగ్గట్టు సురేష్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఏ భాషలోనైనా పట్టు ఉంటేనే పరిణితి చెందుతారు. భాష బాగా తెలిస్తే నటించడం సులభం అవుతుంది` అని అన్నారు.
సంగీత దర్శకుడు మాదవపెద్ది సురేష్ మాట్లాడుతూ ` ఎస్. పి గారు నాకు దొరికిన ఆణిముత్యం. రెండు మంచి పాటలు ఇందులో ఆలపించారు. సతీష్ సినిమాను బాగా తెరకెక్కించాడు. కథా బలం ఉన్న సినిమా ఇది. ఎలాంటి బూతు లేని సినిమా ఇది. మనిషి పాత వాడినే అయినా నేటి తరానికి తగ్గట్టు మోడ్రన్ సంగీతాన్ని అందించాను. మంచి సాహిత్యం కుదిరింది. సినిమా విజయంసాధించిన నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు
చిత్ర దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ` తొలి సిట్టింగ్ లోనే నిర్మాతలు కథ విని ఒకే చేశారు. చక్కని కామెడీ ఎంటర్ టైనర్ ఇది. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే క్యారెక్టర్లు ఎలా ఉంటాయో సినిమాలో అలాగే చూపించాం. నవరసాలు ఉన్న సినిమా ఇది. మిక్చర్ పొట్టం టైటిల్ వినగానే చాలా మంది నవ్వారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు కూడా అలాగే నవ్వు కుంటారు. ఆడియో వేడుకకు విచ్చేసిన అతిధులందరకీ ప్రత్యేక కృతజ్ఞతలు` అని అన్నారు.
భాను చందర్ మాట్లాడుతూ “ అమలా పురం నుంచి షిరిడీ వెళ్లే బస్సులో జరిగే కథ ఇది. ఆద్యంతం నవ్వుకునే విధంగా ఉంటుంది. అన్ని సహజంగా ఉండే పాత్రలే కనిపిస్తాయి. అందరూ బాగా నటించారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. గోదావరి సినీటోన్ టాలీవుడ్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ “ సురేష్ గారు ఆరోగ్యకరమైన సంగీతాన్ని అందించారు. గతంలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం అందిచారు. ఈ సినిమా పాటలు కూడా యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమా లో నటించింన వారందరికి మంచి పేరు రావాలి. జయంత్ కు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ మాట్లాడుతూ “ ఈ సినిమాలో అన్ని రకాల పాటలున్నాయి. మంచి స్టోరీ. జయంత్ కొత్త వాడైనా బాగా నటించాడు. టీం అందరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. అలాగే చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఏమీ ఉండదు. అన్ని సినిమాలు ఒక్కటే` అని అన్నారు.
హీరో జయంత్ మాట్లాడుతూ “ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. మంచి స్టోరీ ఇది. ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులుపనిచేశారు. వాళ్ల నుంచి చాలా విషయాలు తెలుసుకున్నా. నటుడిగా నాకు మంచి అనుభవాన్ని నేర్పిన సినిమా ఇది. షూటింగ్ అంతా సరదాగా జరిగిపోయింది. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
సినిమాలో ఆవకాశం పట్ల మరో హీరోయిన్ గీతాంజలి ఆనందం వ్యక్తం చేసింది.
ఈ వేడుకలో సాగర్, దామోదర్ ప్రసాద్, చిట్టిబాబు, డా..విజయలక్ష్మి, జాన్ బాబు, నవీన్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.