దక్షిణాదిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కంపెనీ ‘ఐ డ్రీమ్ మీడియా’ త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తమ తొలిప్రయత్నంగా వర్ధమాన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, శ్రుతి హాసన్ జంటగా చందు మొండేటి మళయాళ రీమేక్ గా ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ నిర్మించే చిత్రానికి చందు దర్శకత్వం వహించనున్నారు. నిఖిల్ హీరోగా ‘కార్తికేయ’ చిత్రాన్ని రూపొందించి, తొలి ప్రయత్నంలోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించిన చందు మొండేటి ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన రెండో చిత్రం ‘ప్రేమమ్’తోనూ చందు మొండేటి తనదైన శైలి ని పలికిస్తారని తెలుగు చలనచిత్రసీమ లోని పలువురి అభిప్రాయం. ఈ చిత్రం దసరా కానుకగా 2016 అక్టోబర్ లో జనం ముందు నిలువనుంది.
‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ చిత్రానికి దర్శకత్వం వహించబోవడం ఆనందంగా ఉందని చందు మొండేటి పేర్కొన్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్ళతో తనకు ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని చందు అన్నారు. సృజనాత్మకత రంగం ముఖచిత్రం త్వరితగతిని పరిణామం చెందుతోంది. మూవీ మార్కెట్ లో ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ” ప్రస్తుతం ఓవర్సీస్ తెలుగు సినిమాకు మరో ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేయడంలో ఐ డ్రీమ్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్ సంస్థ కూడా నాలాగే సృజనాత్మకతవైపు అడుగులు వేస్తోంది. అలాగే ఈ సంస్థకు పదనైన ఆలోచనలు చేసే యంగ్ టీమ్ ఉండడం మరో ఎస్సెట్. ఈ సంవత్సరం ఆఖరులోగా ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుంది. నటీనటవర్గం, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము” అని చందు తెలిపారు.
యూ ట్యూబ్ లో ఐ డ్రీమ్ హవా విశేషంగా వీస్తోంది. దాదాపు 1.5 బిలియన్ (150 కోట్లు) వ్యూస్, మిలియన్ (పది లక్షలు) సబ్ స్క్రైబర్స్, 150 ఛానెల్స్, దాదాపు 15,000 గంటల డిజిటల్ కంటెంట్ (వీటిలో దాదాపు 2000 చలనచిత్రాలు), ఓటీటీ స్పేస్ లో విశేషాదరణ పొందుతూ ఐడ్రీమ్ మీడియా ప్రస్తుతం అందరు నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్, న్యూజెర్సీ కేంద్రాలుగా ఈ సంస్థ నిర్వహణ సాగుతోంది. తెలుగు, తమిళ చలన చిత్రాలు, వాటితో పాటు పలు లఘుచిత్రాలు, ‘టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్’ పేరున సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, ‘ఇండియన్ పొలిటికల్ లీగ్’ (ఐపీఎల్), ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ వంటివి ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ చూరగొన్నాయి.
“చందు దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రాన్ని మేము నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని ఐ డ్రీమ్ వ్యవస్థాపకులు,సీఈవో వాసుదేవరెడ్డి చిన్నా తెలిపారు. చందు ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని, అతని నిర్దేశకత్వంలో ఓ మంచి చిత్రం తప్పకుండా జనానికి అందిస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటామన్న నమ్మకం మాకుందని ఆయన అన్నారు. చిత్ర కథానాయకుడు ఎవరన్నదానితోపాటు మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలతో మీ ముందుకు త్వరలో వస్తామని , మీడియా మిత్రులందరికీ ‘వినాయక చవితి’ శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి