ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘టు స్టేట్స్’ (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది’ అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచెమ్.. వినాయక్ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. విశేషం ఏంటంటే.. హిందీ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి ఈ సంస్థ రీమేక్ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్’.
పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్న అభిషేక్ దష్టికి వెంకట్ కుంచెమ్ ఈ ‘2 స్టేట్స్’ని తీసుకెళ్లారు. మంచి కథాంశంతో రూపొందించిన చిత్రం కావడం, హిందీలో ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అభిషేక్ ముందుకొచ్చారు. అతి త్వరలో నటీనటుల వివరాలు, మిగతా విషయాలు తెలియజేస్తానని చిత్ర నిర్మాత అభిషేక్ నామా తెలిపారు