గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్, అమరావతి, మంగళగిరి తదితర చోట్ల తొలి, మలి షెడ్యూల్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్‌ని పరిచయం చేస్తూ థాంక్స్‌మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ -“భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. మద్రాసులో ఉన్నప్పటి నుంచి సుపరిచితం. ఈ సినిమాలో నటించే చిన్నా, బెనర్జీ తదితరులంతా స్నేహితులే. నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉంది. తారకరత్న
ఓ పవర్ఫుల్ ఏసీపీగా నటిస్తున్నారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. అలాగే సినిమాలో ఐదు పాటలున్నాయి. శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ, గౌతంరాజు గారు ఎడిటింగ్ చేస్తున్నారు. గోపి మోహన్ – కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది“ అని తెలిపారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ-“కట్టా రాంబాబు మద్రాసులో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఈ కథ రాసుకుని దీనికి పాత్రధారుల కోసం వెతుకుతున్నప్పుడు రాంబాబు గారు నయీమ్ పాత్రకు సూటబుల్ అనిపించి ఎంపిక చేసుకున్నాం. నటనపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండడం వల్ల అంగీకరించారు. ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులు నాకు బాగా తెలిసినవారు. అందువల్ల ఔట్పుట్ బాగా తీసుకోగలననిపించింది. కచ్ఛితంగా విజయం సాధించే చిత్రమిది. అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు“ అన్నారు.
నటుడు చిన్నా మాట్లాడుతూ -“నేను హీరోగా నటించినప్పటినుంచి భరత్ తెలుసు. ఈ సినిమాలో అందరూ తెలుగువాళ్లే నటించాలని కోరుకున్న నిర్మాతలకు ధన్యవాదాలు. అందరికీ తెలిసిన కథనే భరత్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు“ అన్నారు.
బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ-“టైటిల్ బావుంది. మూడు రోజులు నటించే పాత్ర ఉంది చేయమన్నారు. పాత్ర నచ్చి ఓకే చెప్పాను. మంచి పేరు తెచ్చే రోల్ ఇది“ అన్నారు.
ఫైట్మాష్టర్ విజయ్ మాట్లాడుతూ-“మద్రాసులో నేను కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసే తొలినాళ్ల నుంచి రాంబాబు గారు సుపరిచితం. ఫైట్స్‌పై ఆసక్తితో ఫైట్మాష్టర్నయ్యా. ఇంత గ్యాప్ తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి మరీ ఈ సినిమాకి పనిచేసే ఛాన్సిచ్చారు. అందుకు ఆయనకు థాంక్స్. భరత్ మంచి టెక్నీషియన్. చక్కని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు“ అన్నారు.
మౌని (బెంగళూరు), ప్రియ , హర్షిత ,రాగిని , సుమన్ , చలపతిరావు, బెనర్జీ, యల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజగన్ ,ఫిష్ వెంకట్ , కోటేశ్వరరావు , జూనియర్ రేలంగి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కెమెరా: శ్రీధర్ నార్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: పి.వి.రాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: శేఖర్, మాటలు: భవానీ ప్రసాద్, కథ-కథనం-దర్శకత్వం: భరత్