కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ (సి.ఎస్.ఆర్) ఫండ్స్ తో రూపొందిన సందేశాత్మక బాలల చిత్రం “ఆత్రేయ”. డాట్ కామ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై “స్టార్ట్ (సర్వీస్ త్రూ ఆర్ట్) హెల్ప్ ఫౌండేషన్” సౌజన్యంతో శాంతికుమార్ చిలుమల దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదలై, స్టూడెంట్స్ తోపాటు పేరెంట్స్ ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నది. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయల లాభాన్ని, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు అందజేశారు.
హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన విరాళ ప్రదాన కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ జి.నాగేశ్వరరావు, ఇన్ఫోసిస్ గ్లోబల్ హెచ్.ఆర్ వెంకారెడ్డి, ఇ.పామ్ సీనియర్ మేనేజర్ ఇమ్మాన్యుయల్ గోసుల, ఆత్రేయ దర్శకనిర్మాత శాంతికుమార్ చిలుముల పాల్గొన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ ఫండ్స్ తో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించడమే కాకుండా.. ఆ చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన 5 లక్షల లాభాన్ని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కి అందజేసిన “ఆత్రేయ” దర్శకనిర్మాత శాంతికుమార్ చిలుములను స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు.
“ఆత్రేయ” చిత్ర రూపకల్పనలో తనకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా దర్శకనిర్మాత శాంతికుమార్ కృతజ్ణతలు తెలిపారు. తమ ఐ ఇనిస్టిట్యూట్ కు 5 లక్షల విరాళం అందించిన శాంతికుమార్ ని, అందుకు ఆయనకు సహకరించిన వారిని రమేష్ ప్రసాద్, డా జి.నాగేశ్వరరావు అభినందించారు.
శాంతికుమార్ ముందుముందు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తెరకెక్కించాలని, అందుకు అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని ఇమ్మాన్యుల్ గోసల, వెంకారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆత్రేయ దర్శకనిర్మాత శాంతికుమార్ చిలుములను స్పీకర్ మధుసూదనాచారి శాలువాతో సత్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో “ఆత్రేయ” చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన ఆదిత్య, ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్ర పోషించిన అనూహ్య, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ భిక్షపతి తుమ్మలతోపాటు పలు కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు!!