అరుంధతి సినిమాలో విలన్ పశుపతిగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన నటుడు సోనూ సూద్. ఆ సినిమాలో విలన్ గా ఎంత భయపెట్టి కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో.. కరోనా కాలంలో ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం అందించడం ద్వారా.. దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోగా కూడా ఒక స్టేటస్ సంపాదించుకున్నాడు. సోనూసూద్ వ్యక్తిత్వానికి దేశవ్యాప్తంగా జనం నీరాజనం పట్టారు. ఆయన మాటకు కూడా ఒక విలువ ఏర్పడింది. అలాంటి సోనూసూద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిపాలనను వేనోళ్ల శ్లాఘిస్తున్నారు. జనం మాత్రం ఈ పశుపతి ప్రశంసలు ఎంతో ప్రత్యేకమైనవని అంటున్నారు.
సోనూసూద్ చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడుతూ తొలి వందరోజుల్లోనే సీఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సర్.. తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారు.. అంటూ ఏపీ పాలనను మెచ్చుకున్నారు. త్వరలోనే సీఎం ను కలవాలనుకుంటున్నట్టు, ఏపీని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తానని ఆయన అంటున్నారు.
ముందే చెప్పుకున్నట్టు సోనూసూద్ మాటకు ప్రజల్లో సామాన్యుల్లో ఒక విలువ ఉంది. ఆయన చంద్రబాబు పాలనకు అందిస్తున్న కితాబులు కూడా అంతే విలువైనవి. అలాగే ఏపీ అభివృద్ధిలో తాను భాగం అవుతానని ఆయన అంటున్న మాటలు గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికోసం అడగకుండానే ఒక బ్రాండ్ అంబాసిడర్ సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రగతిశీల ఆలోచనాపరుల మద్దతుతో ఏపీ మరింతగా పురోగతి సాధించగలదని ప్రజలు ఆశిస్తున్నారు.
The post ఆ పశుపతి ప్రశంసలు ఎంతో ప్రత్యేకం! first appeared on Andhrawatch.com.