సినిమాతో నా ప్రణయం, ప్రయాణం ముంబాయిలో వర్మ కార్పొరేషన్ లో సహాయ దర్శకుని గా చేరటం తో మొదలయ్యింది. వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలపైఉండే మక్కువ నన్ను ఆర్జీవీ స్కూల్లో చేరేలా చేసింది. నా తొలిచిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా” వాస్తవికతకి దగ్గరగా ఉంటూ, సహజమైన పాత్రలని,ప్రాంతీయతిని ప్రతిబింబిస్తుంది.
సాధారణంగా సినిమాల్లో వినోదాన్ని చూపించే పని ఎక్కువ చేస్తుంటాం. అయితే ఈ చిత్రం మాత్రం వినోదంతో పాటు ఒక మరపురాని అనుభూతిని ప్రేక్షకులకిమిగల్చాలనే తపనతో తీసింది. ఈ “జయమ్ము నిశ్చయమ్మురా” అత్యంత సహజసిధ్ధమైన సన్నివేశలతోనూ, ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో చూసే సాధారణపాత్రలతోనూ తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో చేసినది.
ఇక కథాంశానికి వస్తే, తనమీద తనకే నమ్మకం లేక ఆత్మ న్యూనతా భావం తో కొట్టుమిట్టాడుతూ , అతని జీవితంలో పొందే అవకాశాలు, అతనికి ఎదురయ్యేఅవరోధాల సమాహారమే ఈ చిత్రం. వ్యక్తిత్వ వికాసం నన్ను బాగా ప్రభావితం చేసిన విషయం అందుకే ఈ సినిమాలోని కథానాయకుడి పాత్ర ద్వారాసాధ్యమైనంత వ్యక్తిత్వ వికాసాన్ని వినోదమార్గంలో చూపించే ప్రయత్నం చేసాను. ఇక ఇందులోని ఉపకథలన్నీ కథానాయకుడికి తోడ్పడేవో లేక అడ్డుపడేవో అయిఉంటాయి. కరీం నగర్ నుంచి కాకినాడ వరకు చేసిన ప్రయాణంలో నా కంటికి ఇంపుగా అనిపించిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని ఈ చిత్రం లోని సన్నివేశాలనిచిత్రీకరించాం . ఈ ప్రక్రియ నా చిత్రాన్ని అందంగా తెరకెక్కించడానికి దోహదపడింది.
“జయమ్ము నిశ్చయమ్మురా” కి ఉపశీర్షికగా “దేశవాళీ వినోదం” ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది సహజత్వానికి, ప్రాంతీయతకి దగ్గరగా ఉండే వినోదం కనుక.నా ఈ చిత్రాన్ని తీయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపిన కళారూపాలు – రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి “అల్పజీవి“, రోబర్ట్ హేమర్ తీసిన “స్కూల్ఆఫ్ స్కౌండ్రెల్స్ (1960)”, బసు చటర్జీ తీసిన “చోటీ సీ బాత్ (1975)”, ఇంకా బిల్లీ వైల్డర్ తీసిన “ది అపార్ట్మెంట్ (1960).
మనం నమ్మిన దాన్ని మనం సినిమాగా తీస్తాం. ప్రేక్షకుల నమ్మకాల కి అవి ఎంత దగ్గరగా ఉన్నాయ్ అనే ప్రాతిపదిక మీద ఆ కథకుని విజయం ఆధారపడిఉంటుంది. మా ప్రచారంలో మేము ఏర్పరిచిన అంచనాలకు మించి ఈ సినిమా బాగుందని ప్రేక్షకులు అన్నప్పుడే మేము విజయం సాధించినట్టు.
ఈ నవంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా “జయమ్ము నిశ్చయమ్మురా” విడుదల అవుతోంది. మీ సమీపంలోని థియేటర్ కు వెళ్లి సినిమాని వెంటనే చూస్తారనిఆశిస్తున్నా.
You must be logged in to post a comment.