నిన్న ముంబైలో కన్నులపండవగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కు ‘యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ ‘ను కళాబంధు శ్రీ టి. సుబ్బిరామిరెడ్డి అందించారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు, ప్రముఖ నటీమణి రేఖ, శతృఘ్నసిన్హా, మాధురీ దీక్షిత్, జయప్రద, పద్మినీ కొల్హాపురి తదితరులు షారుఖ్ ఖాన్ ను సత్కరించారు. యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు ఫౌండర్ సుబ్బిరామిరెడ్డి… షారుఖ్ ను ప్రత్యేకంగా అభినందించారు. మహారాష్ట్ర గవర్నర్ తో పాటు రేఖ, శతృఘ్నసిన్హా, జయప్రద తదితరులు షారుఖ్ ఖాన్ నట జీవన ప్రస్థానాన్ని కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ గొప్పతనాన్ని తెలిపారు. బాలీవుడ్ లో ఇరవై ఐదేళ్ళ సినీ ప్రయాణంలో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ సాధించిన ఘనత గురించి తెలిపారు.
ఏప్రిల్ 8వ తేదీ టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం విశాఖ పట్నంలో జరుపుతున్నామని, ఆ వేడుకలో ‘మిలీనియం స్టార్ అవార్డు’ను షారుఖ్ ఖాన్ కు అందచేయబోతున్నామని టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆ అవార్డును విశాఖలో అందుకోబోవడం ఆనందంగా ఉందని షారూఖ్ అన్నారు.
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహిస్తున్న టి. సుబ్బిరామిరెడ్డిని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు, షారూఖ్ ఖాన్, జయప్రద, శతృఘ్నసిన్హా, రేఖ తదితరులు తమ ప్రసంగాలలో అభినందించారు. రాజకీయ నేతగా, సినిమా నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా బహుముఖీనంగా ఆయా రంగాలకు సేవలందిస్తున్న సుబ్బరామిరెడ్డిని వారంత ప్రశంసించారు. శ్రీ సుబ్బరామిరెడ్డి ప్రారంభించిన యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు ఇవాళ ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని వారన్నారు.
ఈ అవార్డును ఇంతవరకూ వరుసగా సినీ దిగ్గజాలు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవాలని ఎంతోమంది సినీ ప్రముఖులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కథానాయకులు, కథానాయికలు ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.