శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్న చిత్రం `వెళ్ళిపోమాకే`. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ప్రశాంత్ విహారి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఆడియో సీడీలను విడుదల చేశారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “ మంచి కాన్సెప్ట్‌తో, మంచి ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవాలి. మంచి కథ, స్క్రిప్ట్‌ను రాసుకోవాలి అని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నమే ఈ `వెళ్ళిపోమాకే`. ఈ సినిమాకు ముందు డైరెక్టర్ యాకూబ్ అలీ నన్ను కలవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాల్లోఉండగా మా హరి ఓ రోజు ఇలా అలీ అనే వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడంట అని అన్నాడు. నేను ఎందుకని అడిగితే ఇలా అలీ అండ్ టీం చేసిన సినిమా గురించి చెప్పి ఆ సినిమా ట్రైలర్ లింక్‌ను మీకు పంపుతారంట అని అన్నాడు. అప్పుడు ఈ సినిమా పేరు వేరేగా ఉంది. సరేనని ట్రైలర్ చూశాను. ట్రైలర్ నచ్చడంతో సినిమా చూడాలని ఆఫీస్ ఎడిటింగ్ రూంకు ఆ సినిమాను తెప్పించుకుని చూడటం జరిగింది. ఇంప్రెస్ అయ్యాను. అప్పటి నుండి ఈ యూనిట్‌తో ట్రావెల్ చేస్తున్నాను. మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెట్టి పద్నాలుగేళ్లు అవుతుంది. ప్రేక్షకులు మాకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇంత అనుభవమున్న మా సంస్థ కొత్తవాళ్ళందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ యూనిట్ చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే..రేపు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి కొత్త సినిమాలు చేయాలనుకునేవారికి ఈ సినిమా ఒక లైబ్రరీ అవుతుంది. అలాలైబ్రరీ చేయాలనేదే నా ప్రయత్నం.
సినిమాలో ఎమోషన్స్, సినిమా తీసిన విధానం అందరికీ నచ్చుతాయి. సినిమా తీసిన బడ్జెట్ ఇప్పుడు చెబితే ఎవరూ నమ్మరు. అందుకే సినిమా బడ్జెట్‌ను సినిమా రిలీజ్ తర్వాత చెబుతాను. ఈ సినిమాకు డబ్బు వస్తుందా..రాదా..అని నాకు తెలియదు కానీ..సినిమా రిలీజ్ చేయడానికి నా వంతుగా నేను సపోర్ట్ చేస్తాను.ఈ సినిమాకనే కాదు..కథ బావుండే ఏ కొత్త సినిమాకైనా నా వంతుగా నేను సపోర్ట్ చేస్తాను. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే, ఇండస్ట్రీకి రావాలనుకున్న చాలా మందికి ఉపయోగపడుతుంది. డైరెక్టర్ అలీ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాడు. ఈ సినిమాను ఎలా తీశారోనని కూడా కొన్ని క్లాస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. అందుకు మీడియా, ప్రేక్షకులు తమ సపోర్ట్‌ను అందించాలి. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరనే దాని కంటే ఇందులో మన పక్కింటి అబ్బాయిలు, అమ్మాయిలు, మన ఆఫీస్ కొలీగ్స్ కనపడతారని చెప్పగలను. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే తక్కువ బడ్జెట్‌లో మంచి కాన్సెప్ట్ సినిమాలు వస్తాయి“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ – “నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎ.ఆర్.రెహమాన్‌గారి దగ్గర వర్క్ చేశాను. నేను చేసిన ఓ వీడియో ఆల్బమ్ చూసిన డైరెక్టర్ అలీగారు నన్ను అప్రోచ్ అయ్యి నేనొక ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాను. మీ సపోర్ట్ అవసరం అని అన్నాడు. క్లాసికల్ టచ్ ఉన్న వెస్ట్రన్ కాంబినేషన్‌లో మ్యూజిక్ చేశాను. ఈ సినిమా జర్నీ నాకు గుర్తుండి పోతుంది. నాకు అవకాశం ఇచ్చిన అలీగారికి థాంక్స్. దిల్‌రాజుగారు సినిమాను నెక్ట్స్ లెవల్ సపోర్ట్ ఇచ్చారు. సినిమాలో ఓ బి.జి.ఎంతో కలిపి ఆరు పాటలున్నాయి. అందరికీ పాటలు నచ్చుతాయి. సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను“అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ – “దిల్‌రాజుగారికి ఓ కథను చెప్పి ఒప్పించి సినిమా చేయడమే కష్టం. అలాంటిది ఓ సినిమాను పూర్తి చేసి తీసుకొచ్చి ఆయన్న ఒప్పించి ఈ సినిమాను రిలీజ్ చేయిస్తున్నారంటేనే ఈ వెళ్ళిపోమాకే యూనిట్ సక్సెస్ కొట్టేసినట్టుగా భావిస్తాను. డైరెక్టర్ అలీ అండ్ టీంకు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ – “ఈ సినిమాను నేను, సినిమాటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ కలిసి స్టార్ట్ చేశాం. తర్వాత నెమ్మదిగా అందరం ఒక టీంగా ఏర్పడి సినిమా చేస్తూ వచ్చాం. వండర్‌ఫుల్ జర్నీ. జంగ్లీ మ్యూజిక్ జిదేష్‌గారు పాటలు వినగానే లేబుల్ ఇచ్చారు. అలాగే హరిగారు ఇచ్చిన సపోర్ట్‌తోనే మేం దిల్‌రాజుగారిని కలిశాం. ట్రైలర్ చూసిన దిల్‌రాజుగారు నన్ను పిలిచినప్పుడు ఈ సినిమా స్లోగా ఉంటుంది. కామెడి ఉండదు. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉండవు ఇవేవీ లేనప్పుడు సాధారణ ప్రేక్షకుడికే సినిమా నచ్చదు మరి దిల్‌రాజుగారికెలా నచ్చుతుంది..ఆయనకు అసలు నచ్చడు అని డౌట్ ఉండేది. కానీ దిల్‌రాజుగారు సినిమా చూసి ప్లాట్ గురించి, సినిమాలోని క్యారెక్టర్ గురించి ఆయన వివరించిన తీరు చూసి షాకయ్యాను. దిల్‌రాజుగారికి సినిమా నచ్చడంతో మేం పడ్డ రెండు, మూడేళ్ళ కష్టమంతా మరచిపోయాం“ అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – “అనుపమఖేర్ ఇన్‌స్టిట్యూట్‌తో శిక్షణ చేసుకున్నా. మా సినిమాతో దిల్‌రాజు గారు మమేకం కావడం చాలా ఆనందంగా ఉంది“ అని అన్నారు.
హీరోయిన్లు సుప్రజ, శ్వేత మాట్లాడుతూ – “ఇంత చక్కటి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది“ అని తెలిపారు.