జనవరి 8న శాత‌వాహ‌న ప‌తాకోత్స‌వం

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” విడుదల తేదీ దగ్గరవుతున్నకొద్దీ నందమూరి అభిమానుల్లోనే కాక యావత్ ప్రపంచంలోని తెలుగువారందరూ ఆనందంతో ఎదురుచూడడం మొదలుపెట్టారు. వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు చిత్ర నిర్మాతలైన వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నడుం బిగించారు. 
 
నాడు శాతకర్ణి తన విజయపరంపరకు ప్రతీకగా ఒకేరోజు, ఒకే సమయంలో దేశంలోని కోటలన్నింటిపై శాతవాహన పతాకం ఎగురవేయించాడని ఎంతమందికి తెలుసు.. ఆరోజే మనకు ఉగాది అయింది, మహారాష్ట్రకు గుడిప‌డ‌వ అయ్యింది, ప్రతి ఏటా రాష్ట్రానికో పేరుతొ ఇప్పటికీ పండుగ జరుగుతూనే ఉంది. శకారంభంలో మొదలైన పండగ యుగాంతం వరకు జరుగుతూనే ఉంటుంది. జెండా అంటే గుడ్డముక్క కాదు, గుండె. ప్రతి భారతీయుడి గుండెల్లో దమ్ము ప్రపంచానికి చాటేందుకు నాడు పతాకోత్సవం జరిగింది. శతచిత్ర నాయకుడు నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయ శాతకర్ణిగా కొలువుదీరబోతున్న థియేటర్లన్నీ శాతవాహన కోటలవ్వబోతున్నాయి.. 8వ తేదీ తెలుగు రాష్ట్రాల్లోని వంద థియేటర్లపై ఒకేసారి శాతవాహన పతాక ఎగురబోతొంది. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైనమెంట్స్ సగర్వంగా ఈ వర్తమానాన్ని జాతికి తెలియజేస్తోంది. ఇది పతాక ఆవిష్కరణ మాత్రమే కాదు.. రాబోయే విజయానికి నాంది ప్రస్తావన. 
 
 జనవరి 8వ తారీఖున సాయంత్రం 5.40 నిమిషాలకు ప్రారంభం కానున్న శాతవాహన పతాకోత్సవాన్ని సినిమా యూనిట్ విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్ వద్ద మొదలుపెడుతుంది. మిగతా వంద థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు ఈ పతాకోత్సవాన్ని ఒకే సమయంలో నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. “ఈనెల 8వ తారీఖున ప్రారంభించనున్న “శాతవాహన పతాకోత్సవ” వేడుకకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణతోపాటు మా దర్శకులు క్రిష్ మరియు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా హాజరుకానున్నారు. మిగతా 99 థియేటర్లకు నందమురి అభిమానులు స్వయంగా లీడ్ తీసుకొని వారే ఈ పతాకోత్సవాన్ని ఒకే సమయంలో నిర్వహించనుండడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉండబోతొంది. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, శాతకర్ణి గా బాలకృష్ణ నటించిన తీరు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేయడం ఖాయం” అన్నారు. 
 
హేమమాలిని, శ్రేయ శరన్, కబీర్ బేడీలు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్!

About CineChitram

Check Also

కాటమరాయుడు క్రేజ్

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading