నా మొదటి అంతర్జాతీయ చిత్రం “న్యూక్లియర్” – రామ్ గోపాల్ వర్మ

మామూలు కాలేజ్ గొడవల్లో,సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో,నేను తీసిన “శివ” తో మొదలయ్యిన నా కెరియర్ ఇవ్వాల దేశాల మధ్య గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్ లో తియ్యబోతున్న“న్యూక్లియర్” వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను.  

సి యమ్ ఎ గ్లోబల్ నిర్మించబోతున్న నా ” న్యూక్లియర్” చిత్రంచలనచిత్ర చరిత్రలోనే అతి ఖరీదైన చిత్రంగా రూ.340కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతోంది. ఇది కూడా అంతర్జాతీయ యాక్టర్ల రెమ్యునరేషన్  లెక్కవేయకుండా కేవలం మేకింగ్ కి కేటాయించిన బడ్జెట్. 

ఇంత భారీ బడ్జెట్ కి కారణం ఈ చిత్రానికి ఎంచుకున్న అంశాన్ని ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్ లో తెరకెక్కించాలన్న నా నిర్మాతల నిర్ణయం. 

ఈ చిత్రం అమెరికా, చైనా, రష్యా, యెమెన్, ఇండియాల్లో షూటింగ్ జరుపుకోబోతుండగా ఇందులో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్,యెమెన్, ఇండియాలకు చెందిన నటీనటులు నటించనున్నారు. 

“న్యూక్లియర్” చిత్రానికి ఎంచుకున్నది ఒక అత్యంత వినూత్నమైన కథాంశం. అమెరికా, యూరప్, మధ్య ఆసియా..ఇలా ఎక్కడైనా ఈ రోజున అందరినీ ప్రధానంగా భయపెడుతున్న వారు తీవ్రవాదులు…ప్రతి ఉదయం నిద్ర లేస్తూనే ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక భయంకరమైన దాడికి సంబంధించిన వార్త మనం వింటూనే వుంటాం.

న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ని కూల్చేసినవిమానాలు, రోడ్ల మీద జనాన్ని గుద్ది పడేస్తూ  దున్నుకెళ్లే ట్రక్కులు,ప్యారిస్, ముంబాయి వంటి నగరాల్లో వందలమంది అమాయికుల్నిచంపి పారేస్తున్న దృశ్యాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో చూస్తున్నాం వింటున్నాం. కానీ వాటన్నింటికన్నా ఇంకా చాల ఎక్కువుగా అసలు ఊహించటానికే భయపడే అత్యంత భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచన – ఒక వేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏమిటి?” – ఇదే “న్యూక్లియర్” చిత్రానికి సంబందించి నా కథ.

చాలా తీవ్రవాద సంస్థలు న్యూక్లియర్  బాంబులు ఉన్న దేశాలపై కాలుదువ్వుతూ వాటిని కబళించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆలోచనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబ్ ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే, ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో  అర్థమవుతుంది. 

70 ఏళ్ళ క్రిందట జపాన్ లో జరిగిన ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే ,ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక పెద్ద సిటీ లోఅటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే? కేవలం ఇరాక్,న్యూక్లియర్ బాంబులు కలిగి ఉందేమోనన్న అనుమానంతో ఆ దేశం పై అమెరికా చేసిన దాడి  వల్ల,చాలదేశాలమధ్య విద్వేషాలు పెరగడం, మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారిపోవడం, గవర్నమెంట్లు కుప్పకూలడం, మూకుమ్మడిగా ఐసిస్ లాంటి విపరీత తీవ్రవాదులు పుట్టడం జరిగాయంటే, ముంబాయి లాంటి మహా నగరంలో ఒకవేళ ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ బాంబ్ పేలితే అది కచ్చితంగా మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి, తద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తుంది.

ఇదే “న్యూక్లియర్” పేరుతో నేను ఇంగ్లీష్ లో తీయబోయే నా మొదటి అంతర్జాతీయ చిత్ర కధాంశం.

                                  — రామ్ గోపాల్ వర్మ

 

About CineChitram

Check Also

`ఏమిసోద‌రా..మ‌న‌సుకేమైందిరా` షూటింగ్ ప్రారంభం

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading